కర్ణాటక దీటైన జవాబు
● స్వల్ప ఆధిక్యంలో ఆంధ్ర జట్టు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా సాగుతున్న అండర్019 కుచ్‌బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక జట్టు దీటైన జవాబిచ్చింది. ఓవర్‌నైట్ స్కోర్ 176/5 బుధవారం ఆటను కొనసాగించిన కర్ణాటక జట్టు బ్యాటర్ అక్షత్ ప్రభాకర్, సిద్ధార్థ్ అఖిల్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. అక్షత్ ప్రభాకర్ 200 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. సిద్ధార్థ్ అఖిల్ 83, ధ్యాన్ హిరేమత్ 47 పరుగులు చేశారు. కర్నాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 148.1 ఓవర్లలో 392 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల ఆధిక్యంతో ఆంధ్ర జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 18.1 ఓవర్ల వద్ద 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కోగటం హనీష్ వీరారెడ్డి 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, గురువారం ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ఫలితం డ్రా గా ముగిసే అవకాశమున్నట్లు సమాచారం.


