పర్యాటక అభివృద్ధికి నోచుకోని దుర్గం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
●కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన దేవాలయాలు ●కన్నెత్తి చూడని పర్యాటక, పురావస్తు శాఖలు
రాయదుర్గం టౌన్: విజయనగరాజుల 3వ రాజధానిగా శతాబ్దాల చరిత్ర గల రాయదుర్గం కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయి. వారసత్వ సంపదకు నిలయమైన చారిత్రక కట్టడాలు, ప్రసిద్ది చెందిన ప్రాచీన ఆలయాలు, కోట, కొండలు, గుట్టలు, దేశంలోనే అరుదైన పాదరాస లింగం, దశభుజ గణపతి ఆలయం, లింగాలబండ చతుర్ముఖ పశుపతినాథేశ్వర ఆలయం, జైన సంస్కృతిని చాటిచెప్పే రససిద్దేశ్వరస్వామి ఆలయం, ఏనుగుల బావి, కోనేరు, ప్రాచీన విగ్రహాలతో నేటికీ రాయదుర్గంలో 15వ శతాబ్దపు వైభవం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కొండపై అద్బుతమైన శిల్పకళా సంపద చెక్కు చెదరలేదు. అయితే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు శీతకన్నేయడంతో గుప్త నిధుల వేటగాళ్ల దుశ్చర్యకు ప్రాచీన ఆలయాలు కాస్త కాలగర్భంలో కలిసి పోతున్నాయి. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర పర్యాటక శాఖ, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. రాయదుర్గానికి రాచమార్గమైన కోట ఊరువాకిలిని ఆధునికీకరించే విషయంలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. కోటగోడలు శిథిలావస్థకు చేరుకుని కళావిహీనంగా మారాయి.


