సమస్యలు పరిష్కారం కావడం లేదు : మంత్రి కేశవ్
అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, సమస్యలపై ప్రజల నుంచి అధికారులు, జిల్లా యంత్రాంగానికి, రాజకీయ వ్యవస్థకు అందుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అపరిష్కృత సమస్యలపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్‌తో కలసి అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులతో సమీక్షించినప్పుడు పరిష్కారం కాని వాటిని కూడా అయినట్లుగా చూపించినట్లుగా వెల్లడైందన్నారు. ఇలాంటి వాటిలో ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 50 శాతం వరకు ఉంటున్నాయన్నారు. ప్రతి అర్జీని ప్రత్యేకంగానే భావించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండాలి
అనంతపురం టౌన్: విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ రక్షక్ వాహనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, విజిలెన్స్ సీఐ విశ్వనాథ్‌చౌదరి పాల్గొన్నారు.
వికసించని చామంతి
పెద్దపప్పూరు: మండలంలో రైతులు సాగు చేసిన చామంతి పంట మొగ్గ దశలోనే ఎండిపోతోంది. మండల వ్యాప్తంగా దాదాపు 118 ఎకరాల్లో రైతులు చామంతి పంట సాగు చేస్తున్నారు. గత నెల కురిసిన వర్షాలకు పంటకు తెగుళ్లు సోకాయి. రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కలేదు. క్షేత్రస్థాయిలో ఉద్యాన అధికారులు పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలను వివరించాలని రైతులు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పీఆర్ విభాగం కర్నూలు ఇన్‌చార్జ్‌గా రంగారెడ్డి
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కర్నూలు ఇన్‌చార్జ్‌గా గుత్తికి చెందిన సీవీ రంగారెడ్డి (పీఆర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ) నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి బుధవారం వెల్లడించారు.


