తాడిపత్రిలో కలకలం
● పోలీసుల అదుపులో ధర్మవరం వాసులు
తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్డీటీ కాలనీలో బుధవారం పిల్లల అపహరణ కలకలం రేగింది. మత్తుతో కూడిన బిస్కెట్లు, చాక్లెట్లు చిన్నారులకు ఇచ్చి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ జంటను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దంపతులు కౌసల్య, వెంకట్రాముడు కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తన కుమార్తెతో కలసి కౌసల్య తాడిపత్రికి చేరుకుని ఆర్డీటీ కాలనీలో నివాసముంటోంది. బుధవారం వెంకట్రాముడు తన వెంట మరో యువతిని వెంటబెట్టుకుని తాడిపత్రికి చేరుకుని కూతురిపై మమకారంతో ఆరా తీయడం మొదలు పెట్టాడు. రమేష్‌రెడ్డి కాలనీలోని పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా తెలుసుకుని అక్కడకు చేరుకుని తన వద్ద ఉన్న కుమార్తె ఫొటోలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు చూపించాడు. అక్కడ లేదని తెలుసుకున్న అనంతరం వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థులకు పంచి ఆర్డీటీ కాలనీకి వెళ్లి భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. తన వద్ద మిగిలిన చాక్లెట్లు, బిస్కెట్లను కాలనీలోని చిన్నారులకు పంపిణీ చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకుని వివరాలు అడిగారు. సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఆప్‌గ్రేడ్ పీఎస్‌కు తరలించారు. వెంకట్రాముడు చెబుతున్న వివరాలను నిర్ధారించుకునేందుకు కౌసల్య, ఆమె కుమార్తెను పిలిపించారు. విచారణలో వెంకట్రాముడు చెప్పింది వాస్తవమని నిర్ధారించుకున్నారు. అయితే వెంకట్రాముడు వద్ద కత్తి ఉండడంతో అనుమానాలు రేకెత్తాయి. కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో భార్య అడ్డుపడితే కత్తితో దాడి చేయాలని అనుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు.


