వైఎస్సార్ నాయకుడికి వేధింపులు
న్యూస్‌రీల్
● నోటీసులు ఇస్తామని రప్పించి అరెస్టు చేసిన వైనం
అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగంలో అరాచకాలు తారస్థాయికి చేరాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతు కలను అణచివేసేందుకు ‘పచ్చ’ నేతలు యత్నిస్తున్నారు. తాజాగా అనంతపురంలో మూడో డివిజన్ కార్పొరేటర్ అంకే కుమారమ్మ భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు బోయ కృష్ణమూర్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. గొడవ కేసులో కేవలం నోటీసులు ఇస్తామని పిలిపించి అదుపులోకి తీసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ నెల 21న మూడో డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు పర్యటిస్తుండగా టీడీపీ నాయకుడు గోపాల్ కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా ఘర్షణకు దిగాడు. నగరపాలక సంస్థ శానిటేషన్ వర్కర్ కదిరప్పపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం కేసులో నోటీసులు ఇవ్వాల్సి ఉందంటూ వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తిని పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించడం గమనార్హం. పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ నాయకులు ఖండించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిళ్ల మేరకే కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు.


