అత్యవసరమైతే అంతే!
సర్వజనాస్పత్రిలోని కీలక వార్డుల్లో వైద్యుల ఇష్టారాజ్యం
సాయంత్రం 4 గంటలకంతా ఎమర్జెన్సీ, రక్తనిధిలో ఖాళీ కుర్చీలు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రికి అత్యవసర కేసులు తీసుకొస్తే ఇక అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రోడ్డు ప్రమాదాలు, విషం తాగిన వారు, పాముకాటు, కిడ్నీ, లివర్ తదితర బాధితులు ఒక్కోసారి మధ్యాహ్నం వేళ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే, ఆ సమయంలో వైద్యులు పత్తా లేకుండా పోతుండడంతో రోగుల పరిస్థితి గాల్లో దీపంలా మారుతోంది. క్యాజువాలిటీ , రక్తనిధి కేంద్రంలో సాయంత్రం 4 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ మెడిసిన్‌కు తాళాలు..
క్యాజువాలిటీకి వచ్చే ప్రాణాంతక కేసులకు సకాలంలో వైద్యం అందించి అనంతరం వార్డులకు పంపాలి. కానీ క్యాజువాలిటీలో విధుల్లో ఉండాల్సిన హెచ్‌ఓడీతో పాటు మిగిలిన వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. వాస్తవంగా 24 గంటలూ ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు షిఫ్ట్‌ల రూపంలో అందుబాటులో ఉండాలి. కానీ, వైద్యులందరూ ఉదయం వేళ మాత్రమే పని చేసి తమకేం పట్టదన్న ధోరణిలో వెళ్లిపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి రోజూ 600 నుంచి 800 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ క్రమంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో భారమంతా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, పీజీలపై పడుతోంది.
రక్తనిధిలోనూ అంతే..
సర్వజనాస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. వాస్తవంగా ఇక్కడ కూడా పెథాలజీ విభాగానికి చెందిన వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి ఉన్నా అటువంటి పరిస్థితి లేకుండా పోతోంది. గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, సర్జికల్ తదితర వార్డులకు రక్తం అందించే ముందు పెథాలజిస్టులు పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, వారికి సొంత ఆస్పత్రులు ఉండడంతో పత్తా లేకుండా పోతున్నారు. దీంతో రాత్రి వేళ రక్తం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయాలపై ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కలెక్టర్ ఆనంద్ అయినా స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.


