ముసురుకున్న ‘మోంథా’ మేఘం
ఒకట్రెండు చోట్ల భారీ వర్షసూచన
అన్నదాతల్లో ఆందోళన
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా ‘మోంథా’ తుపాను మేఘం ముసురుకుంది. తుపాను ప్రభావంతో సోమవారం సాయంత్రం బెళుగుప్ప, గుంతకల్లు, నార్పల, శింగనమల, ఉరవకొండ,ఆత్మకూరు,కూడేరు,బ్రహ్మసముద్రం, రాప్తాడు, పామిడి, విడపనకల్లు, గుత్తి తదితర మండలాల్లో వర్షం కురిసింది. ‘మోంథా’ ప్రభావంతో ఏ క్షణంలోనైనా వర్షాలు కురవొచ్చని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న నూర్పిడి జరుగుతున్న నేపథ్యంలోనే తుపాను పట్టుకోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అరటి, టమాట, ఇతర పంటల సాగు రైతులకూ దిక్కుతోచడం లేదు. అయితే తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ చెబుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. మంగళ, బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు.
అందరూ అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం అర్బన్: జిల్లాపై మోంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా లేకపోయినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తుపాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అదే విధంగా డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 8500292992కు ఫోన్ చేసి సాయం లేదా సమాచారం కోరవచ్చని ప్రజలకు సూచించారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు చెట్లు, టవర్లు, స్తంభాలు, బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరారు.


