అర్చకుల డిమాండ్లివే
● ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చాలి.
● వేతనం పెంచాలి.
● ప్రస్తుత ప్రభుత్వంలో అర్చకుల ఆధీనంలో ఉన్న మాన్యానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు భరోసా అందడం లేదు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.
● 6సీ లోని అన్ని ఆలయాలకు డీడీఎన్‌ఎస్ (ధూపదీప నైవేద్య పథకం) వర్తింపజేయాలి.
● ఖాళీగా ఉన్న ఈఓ పోస్టులను భర్తీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
● అర్చకులకు భద్రత కల్పించాలి.
● ఇచ్చిన హామీ మేరకు హెల్త్‌కార్డులు జారీ చేయాలి.
● అర్చకుల ఐడీ కార్డులను అధికారికంగా మంజూరు చేయాలి.
అనంతపురం కల్చరల్: దైవ సేవలో ఉండే అర్చకులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఏళ్ల తరబడి అపరిష్కృత సమస్యలతో కాలం నెట్టుకొస్తున్నారు. అతి తక్కువ వేతనం, అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హెల్త్‌కార్డులు, ధూపదీప నైవేద్య పథకంలో లొసుగుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
నిబంధనల పేరుతో కొర్రీలు
ఎన్నికల వేళ నాయకులిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా అర్చక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చివరకు దేవదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో నిబంధనల పేరుతో కొర్రీలు విధిస్తుండడంతో అర్చకులు సతమతమవుతున్నారు. కొన్ని ఆలయాల్లో అర్చకులు మరణిస్తే వారి కుటుంబాలకు దేవదాయ శాఖ పరంగా సౌలభ్యాలు సకాలంలో అందడం లేదు. చివరకు ఆ ఆలయాల్లో అర్చకుల భర్తీ విషయంలోనూ నిబంధనలు అంటూ వారసులను దూరం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కుందుర్పిలోని ఆలయం. అక్కడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న రాంబాబు చనిపోతే ఆయన భార్య గిరిజాకుమారి డెత్ గ్రాట్యూటీ కోసం రెండేళ్లుగా దేవదాయ శాఖ ఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక్కడ తిరకాసుపెట్టి ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి రూల్స్ లేవని తిప్పి పంపారు. చివరకు గుడిలో నిత్యపూజలు సజావుగా సాగేందుకు కనీసం అన్న కొడుకుకై నా అర్చకుడి పోస్టు ఇప్పించాలని ఆమె ఎండోమెంటు కార్యాలయ అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది.
దేవదాయ శాఖ పరిధిలో
3 వేలకు పైగా ఆలయాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండోమెంటు పరిధిలో 3,143 ఆలయాలున్నాయి. ఇందులో అనంతపురం కింద 2,004, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 1,139 ఆలయాలున్నాయి. వీటిలో డీడీఎన్‌ఎస్, ధార్మిక పరిషత్తు (డీపీ) పథకం వర్తిస్తున్న ఆలయాల సంఖ్య మరీ హీనంగా ఉంది. అనంతపురం జిల్లాలో డీడీఎన్‌ఎస్ కింద 403, డీపీ కింద 170 ఆలయాలు ఉండగా, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో డీడీఎన్‌ఎస్ కింద 274, డీపీ కింద 43 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేయాలని ఏళ్ల తరబడిగా అర్చకులు కోరుతున్నారు.
చేకూరని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి
ఈఓల కొరతతో ముందుకు సాగని
43 రిజిస్ట్రేషన్లు
పీడిస్తున్న ఈఓల కొరత
గతంలో ఉమ్మడి జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో 25 మందికి పైగా ఈఓలుండేవారు. ప్రస్తుతం వివిధ కారణాలతో ఆ సంఖ్య 18కి పడిపోయింది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాలో కేవలం నలుగురే ఉండడం గమనార్హం. దీంతో పని భారంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఫలితంగా అర్చకుల సమస్యలు పేరుకుపోతున్నాయి. ఆలయాల ఆస్తులు, మాన్యం రిరకార్డు చేసే ప్రక్రియ (43 రిజిస్ట్రేషన్) మందకొడిగా సాగుతోంది. అర్చకుల పట్ల గతంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా అర్చకులు అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. అలాగే వేర్వేరు సందర్భాలలో తమ డిమాండ్లను నెరవేర్చాలని అర్చకులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.


