జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృత
హవ్వ... ఇదేం పోస్టింగ్!
● ‘దుర్గం’ సబ్ రిజిస్ట్రార్‌గా మళ్లీ రామ్మోహన్
● గతంలో అక్కడ అక్రమాలకు
పాల్పడడంతో సస్పెన్షన్
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు ఎక్కడికై నా పోస్టింగ్ ఇచ్చేస్తారు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌గా మళ్లీ రామ్మోహన్ నియమితులు కావడమే ఇందుకు నిదర్శనం. గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తూ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఆయనకు తిరిగి అక్కడికే పోస్టింగ్ ఇవ్వడాన్ని చూసి ఆ శాఖలో పని చేస్తున్న అధికారులే విస్తుపోతున్నారు. వివరాలు.. ఏడాది క్రితం బెళుగుప్ప మండలంలో ఒక వ్యక్తి 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే, ఇది జరిగిన నాలుగు నెలలు తర్వాత సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ప్రమేయం లేకుండా విక్రయించిన వ్యక్తులతో కుమ్మక్కై ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశాడు. విషయంపై బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ పాత్ర ఉన్నట్లు నిర్ధా రించి అతన్ని సస్పెండ్ చేశారు. 6 నెలల అనంతరం బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా అక్కడి నుంచి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేయడం.. వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంతోనే బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్మోహన్ గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన సమయంలోనే ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అలాంటి అధికారికి మళ్లీ అక్కడికే పోస్టింగ్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా ఆమె స్పందించారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రామ్మోహన్‌ను బదిలీ చేసినట్లు తెలిపారు. బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా అక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అధికారికి ఇన్‌చార్జ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


