ఆకట్టుకున్న ఓపెన్ హౌస్
అనంతపురం సెంట్రల్: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసుకార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్ ఆకట్టుకుంది. పోలీసులు విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి ఆసక్తిగా గమనించారు. సాంకేతిక పరికరాలపై ఎస్పీ జగదీష్ అవగాహన కల్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్‌ఐలు పవన్‌కుమార్, మధు, రాముడు, ఆర్‌ఎస్‌ఐలు జాఫర్, బాబ్జాన్, మగ్బుల్ తదితరులు పాల్గొన్నారు.
పరిష్కార వేదికకు 145 వినతులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 145 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు.
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా
జస్టిస్ భానుమతి
అనంతపురం: ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల పనితీరు, పరిశీలన, అజమాయిషీ, కేసుల పర్యవేక్షణ, న్యాయ వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇది వరకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న జి.రామకృష్ణ ప్రసాద్ (ఏపీ హైకోర్టు న్యాయమూర్తి) శ్రీకాకుళం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా నియామకం అయ్యారు.
తుపాన్ నేపథ్యంలో
అప్రమత్తంగా ఉండాలి
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్‌క్లాక్: తుపాన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తుపాన్ సమయంలో ఎవరూ ఇళ్లను విడిచి బయటకు వెళ్లకూడదని, విద్యుత్ తీగలు, చెట్లు, పాడుబడిన భవనాల సమీపాల్లో ఉండరాదని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సివిల్ సర్వీసెస్ క్రీడాకారుల
ఎంపిక పోటీలు వాయిదా
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 29న జరిగే సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను వాయిదా వేశారు. ఈ మేరకు డీఎస్‌డీఓ మంజుల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
మెగా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సిటీ: స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.సరిత సోమవారం వెల్లడించారు. 2005–2016 సంవత్సరాల మధ్య కాలంలో చదివి ఫెయిలైన అభ్యర్థుల కోసం సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29 నుంచి నవంబర్ 29వ తేదీలోపు కళాశాలలో ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు 96764 14799లో సంప్రదించాలన్నారు.
జిల్లాకు 1,822 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: నర్మదా కంపెనీకి చెందిన 1,822 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం జిల్లాకు చేరింది. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పరిశీలించారు.
ఆకట్టుకున్న ఓపెన్ హౌస్


