
ఫేక్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్‌కు దరఖాస్తు
● వజ్రకరూరులో వెలుగు చూసిన ఘటన
● డీఆర్వోకు ఫిర్యాదు చేసిన బాధితులు
వజ్రకరూరు: ఓ వ్యక్తి తనకు సంబంధం లేని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఘటన వజ్రకరూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు అప్రమత్తమై డీఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన పుష్పావతి, రవికుమార్, రమేష్‌బాబు, రాకేష్‌బాబు తదితరులకు అదే గ్రామంలోని సర్వే నంబర్లు 133, 165, 164–1లో 9.75 ఎకరాల భూమి వారి తాత, ముత్తాలకాలం నుంచి సంక్రమించింది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడు గ్రామానికి చెందిన రుషింగమయ్య అనే వ్యక్తి ఇందులోని మూడు ఎకరాల భూమిని మ్యుటేషన్ టైటిల్‌డీడ్ కమ్ పీపీబీ కోసం ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో ఈ నెల 13న వజ్రకరూరు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఈ తతంగం గురించి తెలుసుకున్న భూమి యజమానులు వజ్రకరూరుకు చేరుకుని కూపీ లాగారు. తర్వాత డీఆర్‌ఓను అనంతపురంలో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసిన రుషింగమయ్య, సహకరించిన మీ సేవ నిర్వాహకుడు శ్రీనాథ్‌గౌడ్‌లపై విచారణ చేపట్టి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. ఇదిలా ఉండగా జిల్లాలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ అధికారి వాటా్‌స్ ద్వారా వివరాలు పంపించి, మ్యుటేషన్ చేయాలని ఒత్తిడి చేయడంతో తాను రుషింగమయ్య పేరుతో దరఖాస్తు చేసినట్లు మీ సేవ కేంద్రం నిర్వాహకుడు చెబుతున్నారు.