
‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’
● నేటి నుంచి స్పీడ్ పోస్టులోకి రిజిస్టర్ పోస్టు విలీనం
● తడిసి మోపెడవుతున్న చార్జీలు
అనంతపురం సిటీ: రిజిస్టర్ పోస్టును రద్దు చేసి, స్పీడ్ పోస్టులో కలిపేస్తున్నట్లు ప్రకటించిన తపాలా శాఖ.. స్పీడ్ పోస్టు చార్జీలను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు ఈ–కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి సేవలు, దేశ వ్యాప్తంగా ఒకే టారిఫ్, విద్యార్థులకు 10 శాతం రాయితీ అంటూ నమ్మబలికే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.
నేటి నుంచే స్పీడ్ పోస్టు అమలు : అతి తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా కొనసాగుతూ వచ్చిన రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ పూర్తిగా రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. తపాలా శాఖ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల వారిపై అదనపు భారం పడుతోంది. అంతేకాక పోస్టు డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ధ్రువీకరణ తరువాతే పోస్టుమాన్ ఆ పోస్టును అందజేస్తారు. ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్ మీద జీఎస్టీ కాకుండా అదనంగా ఒక్కో ఆర్టికల్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. బల్క్ సేవలు వినియోగించుకునే సంస్థలకు 5 శాతం తగ్గింపు ప్రకటించింది. అయితే తపాలా శాఖ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే..
కేంద్ర తపాలా శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ కొరియర్ సంస్థలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులోకి విలీనం చేయడం వినియోగదారుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది.
– ఇనగలూరు ఇమ్రోజా, నిరుద్యోగి, అనంతపురం
ధరలు పెంచి రాయితీనా?
అందరికీ అనువైన ధరలతో ఉన్న రిజిస్టర్ పోస్టును రద్దు చేసిన స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్పీడ్ పోస్టు ధరలు విపరీతంగా ఉన్నాయి. పైగా విద్యార్థులకు మాత్రం పది శాతం రాయితీ ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. ధరలు ఇష్టానుసారంగా పెంచి తగ్గిస్తున్నట్లు బుకాయించడం దేనికో?
– బోయ ఎస్.పల్లవి, ఉద్యోగిని, అనంతపురం

‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’

‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’