
సమగ్ర శిక్షలోనూ అందని రెన్నెళ్ల జీతాలు
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అతి పెద్ద పండుగ చేసుకోలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, మండల్ లెవెల్ అకౌంటెంట్లు, సీఆర్పీలు, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు, ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, ఆయాలు, డీపీఓ సిబ్బంది, కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్ టైం పేర్లతో వీరంతా తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు ప్రతి నెలా జీతం డబ్బులు అందితే గాని కుటుంబ పోషణ జరగదు. అలాంటిది రెండు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువుల అతిపెద్ద పండుగ కూడా వచ్చింది. పెద్దల సంగతి పక్కన పెట్టి కనీసం పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. పండుగ ముందు జీతాలు వస్తాయని ఎదురుచూసినా 30వ తేదీతో అది నిరాశగానే మిగిలింది. ఈ నేపథ్యంలో కొందరు వడ్డీకి అప్పులు చేయగా, మరికొందరు ఎంఈఓలు, హెచ్‌ఎంలు, టీచర్ల వద్ద నగదు బదిలీ తీసుకున్నారు. ఎన్నికల ముందేమో ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తామన్న కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగుల పట్ల పక్షపాతవైఖరిని అవలంభిస్తుండడం గమనార్హం.
పస్తులు పెడుతున్నారు
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఫైనాన్స్ కంట్రోలర్‌ను కలిసి విన్నవించాం. పండుగలోపు రెన్నెళ్ల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ వేయలేదు. పండుగ పూట ఉద్యోగులను పస్తులు పెడుతున్నారు.
– కె .విజయ్, సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్

సమగ్ర శిక్షలోనూ అందని రెన్నెళ్ల జీతాలు