
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
● ‘పరిష్కార వేదిక’లో 325 వినతులు
అనంతపురం అర్బన్: ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 325 విన తులు అందాయి. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 250 వరకు ఉండడం గమనార్హం. కార్యక్రమానికి ముందు అర్జీల పరిష్కారంపై అఽధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని చెప్పారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలన్నారు. సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకూడదని స్పష్టం చేశారు.
వినతుల్లో కొన్ని..
● ఉపాధి కోసం తాము ఊరు వదిలి వెళ్లగా, భూమిని ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించాడని డీ.హీరేహాళ్ మండలం హనుమాపురం గ్రామానికి చెందిన పింజారి హుసేన్‌సాబ్ విన్నవించాడు. సర్వే నంబరు 477–బీలో తమకు 2.15 ఎకరాలు ఉందని చెప్పాడు. బతుకుదెరువు కోసం ఊరు విడిచి వెళ్లడంతో ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడని, న్యాయం చేయాలని కోరాడు.
● తమ వ్యవసాయ భూమిని 22ఏ (నిషేధిత భూములు) జాబితాలో వేరేవారి పేరున చేర్చారని నార్పల మండలం గంగనపల్లికి చెందిన సంజీవనాయుడు విన్నవించాడు. గూగూడు గ్రామ పొలం సర్వే నంబరు 266–1ఏలో 5 ఎకరాలు 52 ఏళ్ల నుంచి తమ స్వాధీనంలో ఉందని చెప్పాడు. అయితే 22ఏ కింద వేరొకరిపై చేర్చారని, సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
● వివాదంలో ఉన్న సర్వే నంబర్లను తొలగించాలని ఎం.భాస్కర్ విన్నవించాడు. తమకు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామ పొలంలోని సర్వే నంబర్లు 340–1ఏ3, 370–1, 379–1,2, 380–3, 382–2ఏ అన్నీ వివాదంలో ఉన్నాయని తెలిపాడు. విచారణ చేసి తొలగించాలని విన్నవించాడు.