
డిజిటల్ బుక్‌తో శ్రేణులకు భరోసా
ఉరవకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించేందుకే మాజీ సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ స్కానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎటు చూసినా అక్రమ నిర్బంధాలు, అరెస్టులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినా కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆఖరుకు మీడియా స్వేచ్ఛను హరించే విధంగా దుర్మార్గపు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. హైకోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఇటీవల పోలీసుల తీరును ఆక్షేపిస్తూ స్వయంగా హైకోర్టు ఒక కేసును సీబీఐకు అప్పగించడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను విశ్వ ఖండించారు. గతంలో సినీ నటుడు చిరంజీవి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లినప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. పార్టీ అధినేతను, కార్యకర్తలను అవమానిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టప్రకారం అందరినీ శిక్షిస్తామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు డిజిటల్ బుక్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, విద్యార్థి, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో
అరాచక పాలన
పోలీసులపై హైకోర్టు తీవ్ర స్పందన ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది
రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి
కార్యకర్తలను కాపాడుకుంటాం
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు,
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి