
పనుల్లో పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదు
అనంతపురం సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారులు, బ్రిడ్జిలు, భవనాల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, లేకపోతే ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) బాలూ నాయక్ హెచ్చరించారు. స్థానిక ఆ శాఖ రాయలసీమ సర్కిల్ కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన తారు రోడ్లు, బ్రిడ్జిలు, నాబార్డు కింద చేపట్టిన రోడ్లు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టి అర్ధంతరంగా ఆగిన హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలపై ఈఎన్‌సీ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద కొత్తగా పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, ఒక్కో పంచాయతీ భవనానికి రూ.32 లక్షల చొప్పున కేటాయించినట్లు వివరించారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాణ్యత వంద శాతం పాటించాల్సిందేనని, లేకపోతే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్ష్యాల కేటాయింపులో వెనుకబడిన ఇంజినీర్లు పని తీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా ఎస్‌ఈ బండారు మురళీ, కర్నూలు ఎస్‌ఈ వేణుగోపాల్, ఈఈలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీరాములు, శంకరయ్య, క్యూసీ ఈఈ మల్లికార్జున మూర్తి, ఆదోని ఈఈ రామకృష్ణ, డీఈఈలు కె.లక్ష్మీనారాయణ, జింకల కృష్ణజ్యోతి, గుత్తి మురళీధర్, ఎస్‌ఈ పీఏ రాజేంద్రప్రసాద్ సహా 4 జిల్లాల పీఆర్, పీఆర్‌ఐ, పీఐయూ, క్వాలిటీ కంట్రోల్ డీఈఈలు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణం పరిశీలన
పెద్దవడుగూరు మండలం చిత్తూరు–పామిడి మార్గంలోని వంకపై పీఎంజీఎస్‌వై–3 కింద రూ.16.75 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని ఈఎన్‌సీ శనివారం పరిశీలించారు. నిబంధనల మేరకు బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని ఆదేశించారు.