
ఉపాధి పనుల్లోనూ కక్కుర్తి!
గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పక్కదారి పట్టింది. కాదేదీ అవినీతికి అనర్హం అనే రీతిలో కొందరు అధికారులు ఉపాధి నిధులు స్వాహా చేస్తున్నారు.
తాడిపత్రిటౌన్: ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్.. అనే చందంగా మారింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అధికారుల తీరు. ఓ టెక్నికల్ అసిస్టెంట్ చేతివాటాన్ని ప్రదర్శించి ఎన్‌డబ్ల్యూపీసీ (సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్) నిధులను ఏకంగా తన భార్య బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుని కూలీలను నిట్టనిలువునా ముంచేశాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.
కూలీలను కాదని..
తాడిపత్రి మండలంలో 22 పంచాయతీలు ఉండగా... 21 పంచాయతీల్లో 2014–19 మధ్య కాలంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ వెచ్చించారు. ఈ మొత్తం నిధుల్లో 25 శాతం అంటే రూ.3 లక్షలను అప్పటి ప్రభుత్వం విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఈ నిధులు పది రోజుల క్రితం విడుదలయ్యాయి. వీటిని పంచాయతీల వారీగా ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ఓ టెక్నికల్ అసిస్టెంట్ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. దాదాపు రూ.90 వేలను తన భార్య బ్యాంక్ ఖాతాలోకి బదలాయించుకుని, ఉపాధి కూలీలకు మొండి చెయ్యి చూపాడు.
అక్రమాలకు అధికారుల ఊతమా?
ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అధికారులు ఊతమిస్తున్నారా అనే ప్రశ్నకు ఔననే సమాధానమే వినిపిస్తోంది. పనుల కల్పన మొదలు... బిల్లుల చెల్లింపు వరకూ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రతి అధికారీ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారుల లొసుగులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని కింది స్థాయి సిబ్బంది ఆడింది ఆట.. పాడింది పాటగా రెచ్చిపోతున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బంది బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి అక్రమాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే తాజాగా తాడిపత్రి మండలంలో చోటు చేసుకున్న విత్‌హెల్డ్ నిధులు పక్కదారి పట్టిన అంశం. అక్రమాలకు పాల్పడిన టెక్నికల్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకుంటే గతంలో తాము చేసిన అక్రమాలు అతను బయటపెడతాడనే భయం వారిని వెన్నాడుతుండడంతో... చడీచప్పుడు చేయకుండా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం చేసిన పనులకు సంబంధించిన నిధులు కావడంతో ఈ విషయాన్ని ఉపాధి కూలీలు సైతం మరిచిపోయారు. ఇదే అదనుగా ఉపాధి కూలీలను దగా చేస్తూ ఆ సొమ్మును అధికారులు పంచుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
పక్కదారి పట్టిన విత్‌హెల్డ్ ఉపాధి నిధులు
చేతివాటం చూపిన టెక్నికల్ అసిస్టెంట్
తన భార్య బ్యాంక్ ఖాతాలోకి ఎస్‌డబ్ల్యూపీసీ నిధులు
తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న అధికారులు