
‘పేటీఎం’పై కేసు గెలిచిన లా విద్యార్థి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం చదువుతున్న తన్వీర్ బాషా పేటీఎంపై కేసు గెలిచాడు. తన్వీర్ బాషా ఖాతా నుంచి రూ.2,500 ఎలాంటి సమాచారం లేకుండా కట్ చేశారు. దీంతో పేటీఎంపై తన్వీర్ బాషా వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశాడు. తన కేసును తనే సొంతంగా వాదించుకున్నాడు. పేటీఎం తప్పిదాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. మంగళవారం వాదనలు విన్న కోర్టు వెంటనే పేటీఎం ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా తన్వీర్ బాషాను ఎస్కేయూ లా విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు అభినందించారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం నాయకులు డిమండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ప్రచురించిన కరపత్రాలను జిల్లా కోర్టులో ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. గురుప్రసాద్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరి రామిరెడ్డి, అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) గౌరవాధ్యక్షుడు సీతారామారావు హాజరయ్యారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, జూనియర్ న్యాయవాదుల కోసం న్యాయ మిత్ర పథకం కింద ప్రతి నెలా శిక్షణ భృతిని పెంపుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, ప్రకాష్, కమిటీ సభ్యులు కరిమలగిరి, అశోక్, చంద్రశేఖర్, మల్లేస్ పాల్గొన్నారు.