
అనంతపురం క్రికెట్‌కు వన్నె తెచ్చిన అనూష
అనంతపురం: భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతపురం క్రికెట్ చరిత్రకు వన్నె తెచ్చిన గొప్ప క్రీడాకారిణి అనూష అని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో శనివారం రాయలసీమ క్రికెట్ మైదానాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సీనియర్ క్రీడాకరులు చొరవ చూపించాలన్నారు. ఈ సందర్భంగా భారత జట్టు మహిళా క్రికెటర్ అనూషకు లక్ష రూపాయల చెక్కును జిల్లా క్రికెట్ సంఘం తరఫున మాంఛోఫెర్రర్ అందజేశారు. అనంతరం సీనియర్ క్రికెటర్లు ఒక మ్యాచ్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వి.భీమలింగారెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున, మాజీ రంజీ క్రీడాకారలు కేఎస్ షాబుద్దీన్, ఎల్‌ఎన్ ప్రసాద్‌రెడ్డి, కేఏ ఫయాజ్ అహమ్మద్, డి.సురేష్, షేక్షావలి, డీబీ ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదం కేసులో
ఆరు నెలల జైలు
పామిడి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ యుగంధర్ శనివారం మీడియాకు వెల్లడించారు. 2015 డిసెంబర్ 24న కోయలదిన్నె లలితమ్మ భర్త పామిడిలోని రోడ్డు ప్రనమాదంలో మృతి చెందారు. లలితమ్మ ఫిర్యాదుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత శుక్రవారం విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేఖ వాదనలు వినిపించారు. రోడ్డు ప్రమాదానికి కారకుడు సయ్యద్ అబూబ్ అని తేలడంతో గుత్తి జేఎఫ్‌సీఎం జడ్జి అనిల్‌కుమార్ ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జానంపల్లికి చెందిన విరుపాక్షి (50) తన పొలంలో సాగు చేసిన టమాట పంటకు పురుగుమందులు తీసుకొచ్చేందుకు శనివారం కుందుర్పికి వెళ్లాడు. అక్కడ మందులు తీసుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా అప్పిలేపల్లి – జానంపల్లి మార్గం మధ్యలో అదుపుతప్పి గోతిలోపడ్డాడు. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.