
పాలనలో ‘కూటమి’ సూపర్ ఫ్లాప్
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
రాయదుర్గం టౌన్: ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అంటూ ప్రజలను మోసం చేయడాన్ని మానుకోవాలని, వాస్తవానికి పాలన చేతకాక సూపర్‌గా ఫ్లాప్ అయ్యారనే విషయాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి హితవు పలికారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక ఇన్‌చార్జ్ నాగార్జున, జిల్లా కార్యవర్గ సభ్యుడు సంజీవప్ప, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్‌తో కలసి శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు వందకు పైగా హామీలిచ్చి.. అన్నీ అమలు చేశామంటూ సభల్లో గొప్పలకు పోవడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఊసే మరిచారన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి బారులు తీరుతూ అవస్థలు పడుతుంటే సూపర్ హిట్ సభలు పెట్టి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కార్మికులకు 8 గంటలు ఉన్న సమయాన్ని 10 గంటలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఏఐఎస్‌ఎఫ్ కోశాధికారి ఆంజనేయులు, నరసింహులు, తిప్పేస్వామి, దుర్గప్ప, రవి, గంగాధర, నాగయ్య, కుమార్ తేజ తదితరులు పాల్గొన్నారు.