
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు
● ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్: మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు ధారదత్తం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గిరి, కార్యదర్శి ఓతూరు పరమేష్ మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అనంతపురంలోని టవర్‌క్లాక్ కూడలిలో విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో విద్యారంగంలో నెలకొన్న ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. దీనికి తోడు కొత్త సమస్యలను సృష్టించడమే లక్ష్యంగా కూటమి సర్కారు పాలన సాగిస్తోందన్నారు. నీట్ విధానం తమ రాష్ట్రానికి వద్దంటూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసుకుని కేంద్రంతో పోరాటం సాగిస్తుంటే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివ, నాగభూషణ, సోము, విజయ్, జయ, శశి కుమార్, సాయి పాల్గొన్నారు.
బస్సును ఢీకొన్న కారు
బుక్కరాయసముద్రం: మండలంలోని బాట్లో కొత్తపల్లి గ్రామం సమీపంలో నిలబడి ఉన్న బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. శింగనమల మండలం తరిమెల పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్న అక్తర్‌జాన్, మరో ఉపాధ్యాయుడు, అదే మండలంలోని ఆనందరావు పేట పాఠశాలలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు కారులో పాఠశాలకు వెళుతుండగా లోలూరు వద్ద నిలబడి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ప్రమాదంలో అత్తర్‌జాన్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి
● సాంఘిక సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారి
అనంతపురం రూరల్: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాల రిజిస్ట్రేన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇన్‌చార్జ్) కుష్బూకొఠారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్ షిప్ అందించాలంటే విద్యార్థుల వివరాలను వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది విద్యార్థుల వివరాలను వెంటనే జ్ఞానభూమి లాగిన్‌లో నమోదు చేయాలన్నారు.

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు