
క్యారమ్స్ ఆడుతుండగా గొడవ
గుత్తి రూరల్: క్యారమ్ బోర్డు ఆడుతూ గురువారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన కంబయ్య, రాజు, సుధాకర్ గ్రామ శివారులోని టీ కేఫ్ వద్ద రోజూ చెట్నేపల్లికి చెందిన మౌలి, రాజేష్, రామాంజి, బాలు, రమేష్, శేఖర్‌తో కలసి క్యారమ్ బోర్డు ఆడేవారు.
ఈ క్రమంలో గురువారం కాయిన్ వేసే విషయంలో గొడవ చోటు చేసుకుంది. చెట్నేపల్లి యువకులు సోడా సీసాలు, రాళ్లు, కర్రలతో దాడులు చేయగా బసినేపల్లి కంబయ్య, రాజు, సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కంబయ్యను మెరుగైన చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చింతలరాయుడి హుండీ ఆదాయం రూ.8.75 లక్షలు
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు హుండీ ద్వారా రూ.8,75,824 భక్తులు కానుకల రూపంలో అందజేసినట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు.
చాంపియన్ షిప్ దక్కించుకున్న మధ్యప్రదేశ్ జట్టు
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 ఇన్విటేషన్ కప్ క్రికెట్ టోర్నీ చాంపియన్ షిప్‌ను మధ్యప్రదేశ్ జట్టు దక్కించుకుంది. బరోడా జట్టు రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మధ్యప్రదేశ్ జట్టును విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ జాకబ్ మార్టిన్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి, కార్యదర్శి వి. భీమలింగారెడ్డి, సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ, కోచ్‌లు చిన్నబాబు, పి.శర్మాస్‌వలి, కె.నరేష్, ఆర్.కుమార్, కె.ఇనాయతుల్లా, ఆర్.ప్రవీణ్, భార్గవ్, శంకర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు.

చాంపియన్ షిప్ దక్కించుకున్న మధ్యప్రదేశ్ జట్టు