● ఎమ్మెల్సీ శివరామిరెడ్డి
ఉరవకొండ: సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ సభలో అవాస్తవాలతో ప్రజలను మభ్య పెట్టి సూపర్ ఎస్కేప్ అయ్యారని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 50 సంవత్సరాల వాళ్లకు పింఛన్ లేదు, వికలాంగుల పింఛన్ తొలగించటం, అర్హత గల కొత్త పింఛన్‌లు మంజూరు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత సంవత్సరం 66.34 లక్షలు ఉన్న పింఛన్లను 6192లక్షలకు తగ్గించారన్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ఇప్పటికీ వారి ఖాతాలో నగదు జమ కాలేదని, ఆడ బిడ్డ నిధి లేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. రెండు నెలలుగా యూరియా కోసం రైతులు నానాయాతలు పడుతున్నా పట్టించుకోకుండా సంబరాలు నిర్వహించుకోవడం సిగ్గు చేటన్నారు.
విశ్వకర్మ యోజనకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: విశ్వకర్మ యోజన కింద అందించే రుణాలకు ఉమ్మడి జిల్లాలోని ముస్లిం, దూదేకుల, క్రిస్టియన్ మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చేతివృత్తిదారులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, శిల్ప కళాకారులు, కొలిమి.. బుట్టలు.. చాపలు.. పరకలు అల్లేవారు, చెప్పులు కుట్టేవారు, రజక, కుమ్మరి, టైలర్లు, తాపీ కార్మికులు, బార్బర్లు, రాళ్లు కొట్టువారు, బొమ్మలు, పూలదండలు, తాళాలు తయారీదారులు అర్హులు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు. రుణాలు పొందిన వారు 5 శాతం వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో పీఎంఈజీపీ, సీఎం స్వానిధి, ముద్రా రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తించదు. www.pmvishwakarma.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గుత్తి కొండను కమ్మేసిన పొగమంచు
గుత్తి: పొగ మంచు చుట్టేయడంతో గురువారం ఉదయం గుత్తి కొండ కనిపించకుండా పోయింది. జనాలు ఎంతో ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తిలకించారు. ఓ వైపు వర్షం, మరో వైపు మంచు కారణంగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
‘సూపర్ ఎస్కేప్’ అయ్యారు