
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం కార్పొరేషన్: ‘47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడూ రాయలసీమకు న్యాయం చేయలేదు. విభజన హామీల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే జీఓ తీసుకువచ్చి అడ్డుకున్నారు. హంద్రీ–నీవాను శంకుస్థాపనలకే పరిమితం చేసి సీమకు తీరని అన్యాయం చేశారు. అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవాను 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు చంద్రబాబు కుదించారని, 1995–2004 వరకు సీఎంగా ఉన్న ఆయన హంద్రీ–నీవా, గాలేరు నగరి పనులు కనీసం 50 శాతం పూర్తి చేసి ఉన్నా ఈ రోజున నికర జలాలు అందేవన్నారు.
వైఎస్సార్‌తోనే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ..
జిల్లా సస్యశ్యామలంగా ఉందంటే అది దివంగత నేత వైఎస్సార్ కృషితోనే సాధ్యమైందని, ఆయన హయాంలోనే ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా మారిందని ‘అనంత’ చెప్పారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును 40 టీఎంసీలుగా మార్చి 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2012 నుంచి జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. జీడిపల్లి, గొల్లపల్లి, శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ దేనని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం అనంతపురం సభలో నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ రూపొందించి పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జిల్లాలో బీటీపీ, పేరూరు, మడకశిర బ్రాంచ్ కెనాళ్లపై నిర్దిష్టమైన హామీని ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. హంద్రీ–నీవా లైనింగ్ పనులను ఆగమేఘాలపై పూర్తి చేసి జిల్లా రైతుల పొట్టకొట్టారన్నారు. ఆ వేగంతోనే జిల్లాలో నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు.
జూనియర్ ఎన్‌టీఆర్ తల్లిని కించపరిస్తే మాట్లాడరా?
‘మహిళలకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇటీవల స్వయానా ఆయన సోదరి, ఆయన శ్రీమతికి వదిన, దివంగత ఎన్‌టీఆర్ కోడలు, జూనియర్ ఎన్‌టీఆర్ తల్లిని వారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కించపరిస్తే బాబు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రశ్నిస్తే రైల్వే ట్రాక్‌పై పడుకోబెడతామని, అనుమతి లేకుండా నియోజకవర్గాల్లోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించిన వారి గురించి కూడా ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి’ అని అనంత అన్నారు. 50 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ విషయంలో జిల్లాకు చెందిన ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలేదని, పెనుకొండ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పెనుకొండ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తున్న విషయంపై మంత్రి సవిత మాట్లాడకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో మేయర్ వసీం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కార్పొరేటర్లు శ్రీనివాసులు, చంద్రమోహన్‌రెడ్డి, నాయకులు పుల్లయ్య, జానీ, సాకే కుళ్లాయస్వామి, రామచంద్ర దితరులు పాల్గొన్నారు.
సుదీర్ఘంగా సీమను వంచించిన ఘనుడు
అలాంటి వ్యక్తి రతనాల సీమ అంటే ప్రజలు ఎలా నమ్ముతారు
జూనియర్ ఎన్‌టీఆర్ తల్లిని
దూషించినా చర్యల్లేవ్
ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ, పెనుకొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై ప్రజాప్రతినిధులు మాట్లాడరా?
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత మండిపాటు