బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌కుమార్ బదిలీ
అనంతపురం అర్బన్: జిల్లా నూతన కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కలెక్టర్‌గా ఉన్న వి.వినోద్‌కుమార్‌ను బాపట్ల కలెక్టర్‌గా నియమించారు. ఓ.ఆనంద్ ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆనంద్ గూడూరు సబ్ కలెక్టర్‌గా 2018 అక్టోబరు నుంచి 2019 ఆగస్టు వరకు పనిచేశారు. 2019 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2022 జూలై నుంచి 2022 అక్టోబరు వరకు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు పార్వతీపురం జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 జూలై వరకు విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. 2025 సెప్టెంబర్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.
బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌కుమార్
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో ఇక్కడ కలెక్టర్‌గా ఉన్న ఎం.గౌతమిని బదిలీ చేస్తూ వినోద్‌కుమార్‌ను నియమించారు. 2024 ఏప్రిల్ 4వ తేదీన కలెక్టర్‌గా వినోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాదిన్నర కాలం జిల్లాలో పనిచేశారు.
డీఎఫ్‌ఓ విగ్నేష్ అప్పావు బదిలీ
అనంతపురం సెంట్రల్: జిల్లా అటవీశాఖ అధికారి విగ్నేష్ అప్పావు బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా డీఎఫ్‌ఓ విగ్నేష్ అప్పావును ఎన్‌ఎస్‌టీఆర్ (నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్) డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా అటవీశాఖ అధికారిగా ఎవరినీ నియమించలేదు. తాత్కాలికంగా శ్రీ సత్యసాయి జిల్లా డీఎఫ్‌ఓ చక్రపాణికి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సూపర్ సిక్స్ సభకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం
బొమ్మనహాళ్: అనంతపురంలో బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సిక్స్ సభకు వెళ్లిన బొమ్మనహాళ్ మండలం కురువల్లి గ్రామానికి చెందిన సురేష్ కనిపించకుండా పోయాడు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బస్సులో అనంతపురానికి వెళ్లిన ఆయన.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం కూడా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు ఆందోళనతో బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ నబీరసూల్ మాట్లాడుతూ.. సురేష్ తప్పిపోయినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అయితే అనంతపురం పరిధిలోని అంశం కావడంతో అక్కడి పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

జిల్లా నూతన కలెక్టర్‌గా ఆనంద్