
యల్లనూరులో కుండపోత
● జిల్లావ్యాప్తంగా ఒకే రోజు 47.6 మి.మీ వర్షపాతం
● 120 హెక్టార్లలో పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యల్లనూరు మండలంలో 106.4 మి.మీ వర్షపాతం నమో దైంది. 31 మండలాల పరిధిలో ఒకే రోజు ఏకంగా 47.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. యల్లనూరు తర్వాత కణేకల్లు 94 మి.మీ, ఉరవకొండ 90.2, పామిడి 88.6, గుత్తి 86.2, విడపనకల్లు 79, రాప్తాడు 78.4, వజ్రకరూరు 77.8, గుంతకల్లు 74.2 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే నార్పల 64.6 మి.మీ, పుట్లూరు 60.2, యాడికి 57.2, కళ్యాణదుర్గం 50.2, పెద్దవడుగూరు 47, బుక్కరాయసముద్రం 45, తాడిపత్రి 44.2, గార్లదిన్నె 43.4, డీ హీరేహాళ్ 37.2, అనంతపురం 36, పెద్దపప్పూరు 31.8, ఆత్మకూరు 30.2 మి.మీ నమోదైంది. మిగతా మండలాల్లో కూడా జడితో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గురువారం పగలంతా కూడా తేలికపాటి జడి కురిసింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 60.8 మి.మీ నమోదైంది. 22 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం కన్నా అధికంగానూ, 10 మండలాల్లో సాధారణం, రెండు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా తక్కువగా వర్షం కురిసింది. భారీ వర్షాలు కురిసిన తాడిపత్రి, ఉరవకొండ డివిజన్ల పరిధిలో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జలపాతాలు కళ సంతరించుకున్నాయి.
120 హెక్టార్లలో పంట నష్టం
భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 100 హెక్టార్లలో వరి, వేరుశనగ దెబ్బతినడంతో రూ.25 లక్షలకు పైగా నష్టం జరిగిందన్నారు. టమాట, నర్సరీలు, ఇతర ఉద్యాన పంటలు 50 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

యల్లనూరులో కుండపోత