అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మోస్తరు వర్షం పడే సూచన ఉందన్నారు. 10న ఒక మి.మీ, 11న 15 మి.మీ, 12న 8 మి.మీ, 13న 15 మి.మీ, 14న 13 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.7 డిగ్రీల నుంచి 34.1 డిగ్రీలు, కనిష్టం 23.3 డిగ్రీల నుంచి 23.4 డిగ్రీల మధ్య నమోదవుతాయన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 76 నుంచి 80, మధ్యాహ్నం 50 నుంచి 52 శాతం మధ్య రికార్డు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
మైనార్టీ గురుకులంలో
విద్యార్థి అదృశ్యం
గార్లదిన్నె: మండల కేంద్రంలోని ముస్లిం,మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్య మయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరానికి చెందిన సాకే గౌతమ్ గార్లదిన్నె ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన గౌతమ్ తిరిగి రాలేదు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో వెతికినా తల్లిదండ్రులకు ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జిల్లాకు 800 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. ఇండెంట్ల మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మార్క్‌ఫెడ్‌కు 560 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 240 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
పశువుల మేతగా
ఉల్లి, టమాట!
తాడిపత్రి టౌన్: మార్కెట్‌లో ఉల్లి, టమాట దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటను పశువుల మేతగా వదిలేస్తున్నారు. మార్కెట్‌కు తరలించిన పంటకు గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడంతో తాడిపత్రి మండలంలోని చుక్కలూరు సమీపంలో రోడ్డుపై రైతులు ఉల్లి, టమాట దిగుబడులను పారబోసి తమ దీనస్థితిని వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో 243 ఎకరాల్లో ఉల్లి, 515 ఎకరాల్లో టమాట పంటను రైతులు సాగుచేశారు. ఆరుగాలం శ్రమించి సాధించిన పంటల దిగుబడిని మార్కెట్‌కు తరలిస్తే కనీసం కిలో టమాట రూ.5, ఉల్లి రూ.10తో వ్యాపారులు అడుగుతున్నారని, ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కూడా చేతికి దక్కడం లేదంటూ వాపోయారు.
నేడు సీఎం చంద్రబాబు రాక
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అగస్థ్య అపార్టుమెంట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. 4.40కు హెలికాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరి వెళతారు.
జిల్లాకు వర్షసూచన
జిల్లాకు వర్షసూచన