
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
● మహిళ స్నేహపూర్వక గ్రామం –
పంచాయతీ థీమ్ పై శిక్షణ ప్రారంభం
అనంతపురం సిటీ: మెరుగైన సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా ఉంటోందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళ స్నేహపూర్వక గ్రామం–పంచాయతీ థీమ్–9’ అంశంపై రెండు రోజుల శిక్షణ తరగతులు అనంతపురంలోని జెడ్పీ క్యాంపస్‌లో ఉన్న డీపీఆర్‌సీ భవన్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళల భద్రత, సమానత్వం, సమగ్రాభివృద్ధి వైపు ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సానుకూల మార్పుల కోసం పని చేసే దిశగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ కింద జిల్లాలోని ఆరు మండలాల్లో ఒక్క పంచాయతీ చొప్పున మొత్తం ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామని సీఈఓ శివశంకర్ తెలిపారు. ఇందులో ఆత్మకూరు మండలంలో తోపుదుర్తి, బత్తలపల్లి మండలంలో బత్తలపల్లి, కంబదూరు మండలంలో చెన్నంపల్లి, కనగానపల్లి మండలంలో తగరకుంట, తాడిపత్రి మండలంలో ఊరచింతల, వజ్రకరూరు మండలంలో పాత కడమలకుంట గ్రామాలు ఉన్నాయన్నారు. ఒక్కో పంచాయతీ నుంచి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, వెల్ఫెర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్‌ఎం, వీఓ లీటర్లు ముగ్గురు చొప్పున ఒక్కో పంచాయతీ నుంచి మొత్తం తొమ్మిది మందిని ఎంపిక చేసి, వారికి రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తమ పంచాయతీల్లో అమలయ్యేలా చూడాలని కోరారు.డీడీఓ నాగశివలీల, డీపీఆర్‌సీ శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్‌దాస్ పాల్గొన్నారు.