
యూరియా కోసం రైతుల ఆందోళన
కణేకల్లు: మండలంలోని కణేకల్లు క్రాస్‌లో ఉన్న కోరమాండల్ వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. కోరమాండల్‌కు ఒక లోడు (280 బస్తాలు) యూరియా రావడంతో మంగళవారం ఉదయం కణేకల్లు మండలంతో పాటు చుట్టుపక్కల మండల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో చాలా మంది రైతులకు టోకన్లు దొరకలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వేచి ఉన్నా తమకు టోకన్లు ఇవ్వలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కోరమాండల్ మేనేజర్ సోము సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఏఓ జగదీష్ అక్కడకు చేరుకున్నారు. దీంతో అధికారులను రైతులు నిలదీశారు. పక్క మండలాల రైతులను మినహాయించి స్థానిక మండల రైతులకు ఏఓ దగ్గరుండి ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున ఇచ్చేలా టోకన్లు జారీ చేయించారు.
విద్యార్థులకు ‘సూపర్’ మోసం
● వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్టంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులను సూపర్ మోసం చేసిందని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ మండిపడ్డారు. బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు.. విద్యార్థి సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంంట్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా కోర్సులు పూర్తయినా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కరువయ్యాయన్నారు. ఈ అంశంగా హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు ఉచితంగా వైద్య విద్య అభ్యసించేందుకు వీలుగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్‌కు అప్పగించి వైద్యాన్ని మార్కెట్‌లో సరుకుగా మార్చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా చీకటి జీఓను తెచ్చి మోసం చేశారన్నారు. డిగ్రీ ప్రవేశాలకు అనుమతులు ఇవ్వకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్: స్థానిక భాగ్య నగర్‌లో నివాసముంటున్న షమీమ్ ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి అల్లీపీరా కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాలోని 11 గ్రాముల బంగారు, రూ.20 వేల నగదు అపహరించారు. మంగళవారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.