
మోసం చేసి విజయోత్సవమా?
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజం
● సీఎంకు బహిరంగ లేఖ
అనంతపురం అర్బన్: హామీలు అమలు చేయకుండా మోసం చేసి విజయోత్సవం జరుపుకోవడం ప్రజలను మభ్యపెట్టడంలో ఓ భాగంగా భావించాల్సి వస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి విమర్శించారు. సీపీఐ తరఫున ముఖ్యమంత్రికి పంపిన బహిరంగ లేఖను మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ, కార్యవర్గ సభ్యులతో కలసి నారాయణస్వామి విడుదల చేసి, మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక ఏడాది తరువాత రూ.13 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పి, ఏడాది తరువాత ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే పరిమితం చేయడం వాగ్ధాన భంగం కాదా? అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిసి రూ.7 వేలు ఇవ్వడం రైతులను దగా చేయడం కాదా? అని నిలదీశారు. 19 నుంచి 59 ఏళ్లు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా జమ చేయకపోవడం, నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం... నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం చంద్రబాబు మోసాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహించేది సూపర్ హిట్ సభ కాదని, అది సూపర్ ప్లాప్ సభ అని దుమ్మెత్తి పోశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవరెడ్డి, శ్రీరాములు, రమణ, సంతోష్‌కుమార్, రాజేష్‌గౌడ్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.