
రెండు పదుల వయస్సులోనే గుండెపోటు
● వివాహిత మృతి
● గ్రామంలో విషాదఛాయలు
రాప్తాడు: రెండు పదుల వయస్సులోనే గుండెపోటుకు గురై ఓ వివాహిత మృతి చెందింది. ఘటనతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వివరాలు.. రాప్తాడుకు చెందిన జానగొండ రాముడు, వెంకటలక్షి దంపతుల పెద్ద కుమారుడు భాస్కర్‌కు ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన బులగొండ నాగలక్ష్మి, నాగరాజు దంపతుల పెద్ద కుమారై నందిని (22)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. సోమవారం సాయంత్రం కళ్లు తిరిగి కిందపడిపోయిన నందిని ని కుటుంబ సభ్యులు అనంతపురానికి పిలుచుకెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ పడిపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్‌ఎంపీని పిలుచుకొచ్చి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్‌ఎంపీ తెలపడంతో వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక రాత్రి 11 గంటలకు నందిని మృతి చెందింది. ‘లో బీపీ’ కారణంగా గుండె పోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అర్థరాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీనర్ జూటూరు శేఖర్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న, వైఎస్సార్ సీపీ నాయకులు సాకే చంద్ర, చింతకాయల జయన్న, టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, మాజీ కన్వీనర్ సాకే నారాయణ స్వామి, సర్పంచ్ సాకే తిరుపాలు తదితరులు నందిని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మంగళవారం ఉదయం నందిని అంత్యక్రియలు నిర్వహించారు.