
డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ వేగవంతం చేయండి
● ఉద్యానశాఖ కమిషనర్ శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగాలని సంబంధిత అధికారులను ఉద్యానశాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఓఎస్‌డీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. డ్రిప్ పరికరాల పంపిణీపై మంగళవారం వారు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లా ఉద్యాణ శాఖ కార్యాలయం నుంచి ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ, ఎంఐ ఇంజనీర్లు, కంపెనీ డీసీఓలు పాల్గొన్నారు. ప్రస్తుత 2025–26లో 18 వేల హెక్టార్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకూ 4,011 మంది రైతులకు 5,402 హెక్టార్లకు మంజూరు చేశారని, ఇందులోనూ ఇన్‌స్టాలేషన్లు తక్కువగానే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 31,804 హెక్టార్లకు రిజిష్ట్రేషన్ చేసుకున్న 22,650 మంది రైతులకు సంబంధించి సీనియార్టి వారీగా ప్రాథమిక పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. వెనువెంటనే బీఓక్యూ, బీఎంసీ, రైతు వాటా కట్టించి వారం రోజుల్లోనే అడ్మినిస్ట్రేటివ్ అనుమతులతో రైతులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో మంజూరు చేసిన రైతుల పొలాల్లో ఈనెల 22 లోపు పరికరాలు బిగించాలన్నారు.