
ఆలయ ప్రతిష్ట ‘గంగ’ పాలు
తాడిపత్రి టౌన్: మండలంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా స్థానిక టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆలయానికి మంగళ, ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అమ్మవారికి జంతు బలులతో మొక్కులు తీర్చుకుంటుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేతలు.. అక్కడ ఓ షెడ్డు ఏర్పాటు చేసి ఏకంగా మద్యం దుకాణం తెరిచారు. ఈ విషయం తెలిసినా అధికారులు, పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయం వద్ద మద్యం అమ్మకాల కారణంగా తాగుబోతుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఆలయ ప్రశాంతత దెబ్బతినడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి ఆలయం వద్ద మద్యం విక్రయాలను ఆపాలని పలువురు మహిళలు కోరుతున్నారు.