
‘కేఎస్‌ఎన్’ హాస్టల్‌లో పాముల కలకలం
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గదుల్లో నిద్రపోతున్న విద్యార్థినులను ఇటీవల ఎలుకలు కరిచి ఆస్పత్రి పాలైన సంగతి మరవకముందే తాజాగా పాముల సంచారం బెంబేలెత్తిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ ఆవరణలో రెండు పాములు కనిపించాయి. ఓ పామును కట్టెతో కొట్టి చంపేశారు. మరోపాము కనిపించకుండా పోయింది. రాత్రి 11.30 గంటల సమయంలో చదువుకుంటున్న కొందరు విద్యార్థినులు బాత్రూంకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గట్టిగా కేకలు వేయడంతో ఇతర గదుల్లో ఉన్న అమ్మాయిలందరూ బయటకు వచ్చారు. పాములు చూసి భయంతో చాలామంది విద్యార్థినులు గదుల్లోకి పరుగు తీశారు.