
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు బాబూ?
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్రశ్న
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్రశ్న
అనంతపురం కార్పొరేషన్: ‘ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏదేదో చేసేస్తాం అంటూ నమ్మబలికారు. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక తూతూమంత్రంగా కొన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పుడేమో అన్నీ అమలు చేసినట్లు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ సభ ఏర్పాటు చేస్తున్నారు. అసలు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో అర్థం కావడం లేదు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10న జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఆయన రాజకీయ జీవితమంతా పచ్చి అబద్ధాలేనన్నారు. ‘సూపర్ సిక్స్’లో మొదటి హామీ అయిన నిరుద్యోగ భృతికే దిక్కు లేదన్నారు. ఇంట్లోని ప్రతి పిల్లాడికీ ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పి అర్హులకు అన్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో 2.75 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ ఇచ్చినట్లు అధికారులు లెక్కల్లో చూపుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంకా 30 వేల మందికి నగదు అందలేదని వివరించారు. ఇంతకన్నా దారుణం ఎక్కడా ఉండదన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి రైతులను రోడ్డెక్కే పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి కేవలం రెండు సిలిండర్లతో సరిపెట్టారన్నారు. వందకుపైగా హామీలను నెరవేర్చలేదన్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 410 అర్జీలు అందాయి. డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు.
వినతుల్లో కొన్ని...
● వైకల్యం తక్కువగా ఉందంటూ పింఛను తొలగించారని రాయదుర్గం పట్టణం పాపట్ల బావి వీధికి చెందిన జి.బసవరాజు విన్నవించాడు. ఏళ్లుగా అందుతున్న పింఛన్ నిలిపేయడంతో ఇబ్బందులు పడుతున్నానని, రీ వెరిఫికేషన్ చేసి న్యాయం చేయాలన్నాడు.
● ఇల్లు బాగుందంటూ 2023 నుంచి వస్తున్న వృద్ధాప్య పింఛను తొలగించారని అనంతపురం రూరల్ మండలం రుద్రంపేటకు చెందిన నారాయణస్వామి వాపోయాడు. పునరుద్ధరించాలని వేడుకున్నాడు.
● డీడీ చెల్లించి ఐదు నెలలవుతున్నా ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయలేదని రాప్తాడు మండలం మరూర్ చెర్లోపల్లికి చెందిన దివ్యాంగుడు నాగేంద్ర వాపోయాడు. ఈ ఏడాది మే 2న రూ.24 వేలు డీడీ చెల్లించానని, పదేపదే తిరగలేనని విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు.
జిల్లాకు 871 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు 871 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. కోరమాండల్ కంపెనీ నుంచి 601 మెట్రిక్ టన్నులు, పారాదీప్ ఫాస్పేట్ కంపెనీ నుంచి 270 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరిందన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్‌కు 530 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 341 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. జేసీ ఆదేశాల మేరకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు బాబూ?

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు బాబూ?