
అన్నదాతకు తోడుగా నేడు వైఎస్సార్ సీపీ పోరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు అంటూ తెల్లార్లూ జాగారం చేస్తున్న పరిస్థితి. ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైతన్నల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లోనూ శరపరంపరగా పోస్టులు కన్పిస్తున్నాయి. సర్కారు తీరుపై సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా దగ్గరుండి రైతుల కష్టాలు తీర్చాల్సిన మంత్రులు అసలు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మీరు ఏం చావు చస్తే మాకేమిటీ’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభ ఏర్పాట్లలో ఉండగా.. అధికారులు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు.
సగం కేబినెట్ అనంతపురంలోనే..
రాష్ట్రంలో ఒక జిల్లాలోనో, ఒక నియోజకవర్గంలోనో కాదు ఊరూరా యూరియా కష్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయని సామాన్యులు వాపోతున్నారు. ఈ నెల 10న ‘సూపర్ సిక్స్–సూపర్‌హిట్’ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 10 మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. సీఎంతో పాటు పవన్‌కల్యాణ్, లోకేష్ సభకు వస్తున్నారని, అట్టహాసంగా చేయాలన్న ఆలోచనతో మంత్రులు ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, రాంప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ తదితరులంతా ఇక్కడే ఉన్నారు. నేడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా రానున్నారు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి అనంతపురంలో మకాం వేశారు.
నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు..
ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం సభ ఏర్పాట్లలోనే తరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో గడిచిన పక్షం రోజులుగా ఇక్కడ యూరియా లేదు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం వదిలి అక్కడికి వెళ్లడం లేదు. మడకశిర నియోజకవర్గంలో రెండ్రోజుల క్రితం తాగునీరు లేక ప్రజలు రోడ్డెక్కారు. కానీ ఆ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం అనంతపురంలోనే ఉన్నారు. ఉరవకొండ, కళ్యాణ దుర్గం, పుట్టపర్తి, రాప్తాడు..ఇలా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు. సభ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం కోసం ఒకర్ని మించి ఒకరు పోటీపడుతున్నారు. వీరి తీరును రైతులు, ప్రజలు ఏవగించుకుంటున్నారు.
అనంతపురం కార్పొరేషన్: రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహింస్తున్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై టవర్‌క్లాక్ మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం చేరుకుంటుందన్నారు. అక్కడ ఆర్‌డీఓకు వినతి పత్రం అందిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు, కూటమి ప్రజాప్రతినిధులకు పట్టడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ‘అన్నదాత పోరు’కు పిలుపునిచ్చిందని తెలిపారు.

అన్నదాతకు తోడుగా నేడు వైఎస్సార్ సీపీ పోరు