
ఉద్యోగోన్నతి లేక ఉసూరు
● డీటీలకు అడహక్ పదోన్నతులపై
దృష్టి సారించని ఉన్నతాధికారులు
● జేఏల విషయంలోనూ అలసత్వం
● నిరాశ నిస్పృహల్లో ఉద్యోగులు
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించే రెవెన్యూ శాఖ ఉద్యోగుల్లో నిర్లిప్తత నెలకొంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులను నిరాశ నిస్పృహల్లోకి నెడుతోంది. ఈ ప్రభావం వారి పనితీరుపైనా పడుతోంది. జిల్లాలో ఏడు చోట్ల తహసీల్దారు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలంలో ఏడాది దాటినా రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించలేదు. తాడిపత్రి, వజ్రకరూరు, విడపనకల్లు తహసీల్దారు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాల్లో పరిపాలనాధికారి, కలెక్టరేట్‌లో భూ సంస్కరణల విభాగంలో స్థానాలు భర్తీ కాలేదు.
అడహక్ పదోన్నతులేవీ..?
తహసీల్దారు పదోన్నతి ప్యానల్‌లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు అడహక్ పదోన్నతి కల్పించి ఖాళీగా ఉన్న ఆయా స్థానాల్లో పోస్టింగ్ ఇస్తారు. దీంతో ఇన్‌చార్జ్ పాలనకు ఆస్కారం ఉండదు. గతంలో అనేక సార్లు ఇలానే అడహక్ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పదోన్నతుల కల్పనలో జాప్యం
రెవెన్యూ శాఖలో పదోన్నతులు ఎండమావులుగా మారాయి. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్‌లకు సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో పదోన్నతికి అర్హులైన జూనియర్ అసిస్టెంట్లు 30 మంది ఉన్నా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
పని నాణ్యతపై ప్రభావం
ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో కోరుకునేది పదోన్నతే. దీనికితోడు శాఖా పరంగా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో పొందితే ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారు. అలాంటి కీలక విషయాల్లో తీవ్ర జాప్యం జరిగితే మానసిక వేదనకు గురవుతారు. ఆ ప్రభావం పడి పనిలో నాణ్యత లోపిస్తుంది. రెవెన్యూశాఖలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. పదోన్నతులపై ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు.