
ఎన్నాళ్లీ నరకం?!
అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో బాలింతలు, గర్భిణులకు అవస్థలు తప్పడం లేదు. చాలీచాలని పడకల నడుమ వారు నరకం చూస్తున్నారు. ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.300 కోట్లతో ఎంసీహెచ్, సర్జికల్ బ్లాక్, మెన్, ఉమెన్ పీజీ హాస్టళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే సర్జికల్, పీజీ హాస్టళ్ల పనులు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అయితే, సార్వత్రిక ఎన్నికలు రావడం.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
నిర్మాణం కలగా..
వచ్చీ రాగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ రూ.300 కోట్ల ప్రాజెక్ట్‌పై గుదిబండ వేసింది. ఏకంగా రూ.78 కోట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు కలగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉన్న వాటిపైనే కక్ష కట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కష్టాలమయం..
ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో గైనిక్ విభాగానికి నాలుగు యూనిట్లు ఉన్నాయి. 120 పడకలు అందుబాటులో ఉంచారు. ఇంకా లేబర్ వార్డు, లేబర్ ఐసీయూ, యాంటీ నేటల్, పోస్టునేటల్, గైనిక్, గైనిక్ ఐసీయూ, ఆరోగ్య శ్రీ, హై డిపెండెన్సీ యూనిట్‌లో 240 మంది గర్భిణులు, బాలింతలను ఉంచి సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజూ 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో 5 సిజేరియన్లు ఉంటాయి. గైనిక్ విభాగానికి సంబంధించి వార్డులు దూరందూరంగా ఉన్నాయి. చిన్నపిల్లల వార్డు ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉంది. వసతులు లేని దృష్ట్యా మధ్యాహ్నం వరకే ఆపరేషన్లు చేస్తుండడంతో ఆ సమయం దాటాక మొదటి అంతస్తులో ఉన్న మెయిన్ ఓటీకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో గర్భిణులు, బాలింతలు నరకం చూడాల్సి వస్తోంది. ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటై ఉంటే ఒకే చోటే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందించే అవకాశం ఉండేది. బ్లాక్‌లో కొత్తగా మరో 200 పడకలు ఏర్పాటు చేస్తే పదుల సంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్‌నర్సులు, తదితర పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉండేది.
ముగ్గురు మంత్రులున్నా..
కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాకు మేలు చేసే విధంగా ఒక్క పని ఆయన చేయలేదు. గతంలో మంజూరైన ప్రాజెక్టులనైనా ఆచరణలోకి తీసుకువచ్చి పేదలకు మేలు చేద్దామనే ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. ఇక మంత్రులు పయ్యావుల కేశవ్, సవితకు వారి నియోజకవర్గాల్లో వ్యవహారాలను చూసుకునేందుకు తీరికలేని పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి.
సర్వజనాస్పత్రిలో అటకెక్కిన ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం
చాలీచాలని పడకలతో గర్భిణులు, బాలింతలకు తప్పని అవస్థలు