
పడిగాపులు.. నిలదీతలు.. వాగ్వాదాలు
కూడేరు/కణేకల్లు/యల్లనూరు: యూరియా కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. గంటల తరబడి వేచి ఉన్నా తగినంత యూరియా కూడా దొరక్కపోవడంతో కడుపు మండిన అన్నదాతలు అధికారులను నిలదీస్తున్నారు.
● కణేకల్లులో యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు సోమవారం ఉదయం 7 గంటలకే ఏఓ కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో నిల్చొని టోకెన్లు తీసుకొన్నారు. 11 గంటల తర్వాత ఎండతీవ్రత ఎక్కువ కావడంతో నిల్చునే ఓపిక లేక పాసుపుస్తకాలు, బ్యాగులను వరుసలో పెట్టి చెట్ల కిందకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘నేను ముందు.. కాదు నేనే ముందు’ అంటూ పలువురు రైతులు కౌంటర్ వద్ద పరస్పరం గొడవకు దిగారు. అయితే, ఎంత సేపు వేచి ఉన్నా ఒక్కో రైతుకు 2 బస్తాలే ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
● కూడేరులోని వ్యవసాయ గోదాము వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. అయితే, స్టాక్ తక్కువ ఉంది.. ఒక్కో రైతుకు ఒక బస్తానే ఇస్తామని ఏఓ శుభకర్ చెప్పడంతో కడుపు మండిన రైతులు రెండు బస్తాలివ్వాలంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు.
● యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి సచివాలయానికి యూరియా రాకపోవడంతో రైతులు సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఇన్‌చార్జ్ వ్యవసాయాధికారి మధుకుమార్ రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి లోడు వస్తుందని చెప్పడంతో రైతులు శాంతించారు.

పడిగాపులు.. నిలదీతలు.. వాగ్వాదాలు