యాడికి/డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్‌లోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థి శ్యాంసుందర్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపిన మేరకు.. యాడికికి చెందిన చేనేత కార్మికులు రమేష్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్యాంసుందర్ డోన్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి ఆదివారం తిరిగి వసతి గృహానికి చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బాత్ రూంలో శ్యాంసుందర్ ఉరేసుకుని కనిపించాడు. ఉదయం కాలకృత్యాల కోసం బాత్‌రూంకు వెళ్లిన విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్ మేరీ సూర్యకుమారి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ ఇంతియాజ్‌బాషా, ఎస్‌ఐలు శరత్‌కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ఆర్డీఓ నరసింహులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. అన్ని కోణాల్లో విచారించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని సీఐ తెలిపారు.