
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
● ప్రతి నెలా బ్లాక్ మార్కెట్‌కు
టన్నుల కొద్దీ రేషన్ బియ్యం
● పేదల పొట్ట కొడుతున్న డీలర్లు
● కొందరు ప్రజాప్రతినిధులు,
పోలీసుల కనుసన్నల్లోనే దందా
రేషన్ మాఫియా అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చివరకు కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే.. వచ్చే నెలలో తీసుకోమని చెబుతున్నారు. జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు,
పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ నేతలు అక్రమ దందా కొనసాగిస్తున్నారనే
ఆరోపణలు ఉన్నాయి.
తాడిపత్రి టౌన్: జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు టీడీపీ నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ కావడం, అందులో అధికారులతో జరిగిన ఒప్పందాలపై ప్రస్తావించడం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లబ్ధిదారులకు డీలర్లు నగదు అంటగడుతూ రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించేస్తున్నారు. ఒక్క తాడిపత్రి నియోజకవర్గం నుంచే ప్రతి నెలా వందల టన్నుల రేషన్ బియ్యాన్ని మాఫియా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అధికార పార్టీ అండతో పోలీసులను లోబర్చుకున్న కొందరు టీడీపీ నేతలు తాడిపత్రి నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు తెరలేపారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే యాడికి, తాడిపత్రిలో వందల కొద్దీ టన్నుల రేషన్ బియ్యం నిల్వలను అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఆ రెండు మండలాల్లో అత్యధికం..
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, తాడిపత్రి మండలాల్లో టీడీపీ నాయకుల అండతో కొందరు డీలర్లు ఒకట్రెండు రోజులు మాత్రమే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసి, మిగిలిన వారి వేలి ముద్రలు తీసుకుని రేషన్ స్టాక్ లేదని చెబుతూ నగదు ముట్టజెబుతున్నారు. ఇంకొందరు డీలర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వేలి ముద్రలు తీసుకుని నగదు అందజేస్తూ దందాకు తెరలేపారు. తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్, నందలపాడు, గన్నెవారిపల్లి కాలనీ, రంగప్ప కాలనీ, శ్రీనివాసపురం, జయనగర్ కాలనీ, తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ, యాడికి, రాయలచెరువు ప్రాంతాల్లో మాఫియాను తలదన్నేలా రేషన్ దందా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా 150 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని పదుల సంఖ్యలో లారీలు, ఐచర్లలో పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రి మండలం పెద్ద పొలమడ వద్ద ఉన్న గోదాము నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.
రేషన్ బియ్యం పట్టివేత
వజ్రకరూరు: మండలంలోని రాగులపాడు క్రాస్ వద్ద ఆదివారం ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఉరవకొండలోని స్టాక్ పాయింట్‌కు తరలించినట్లు సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మి తెలిపారు.