చూడడానికి బాగానే కనిపిస్తారు.. మంచంపై నుంచి కాలు కింద మోపలేరు.. చేతులు పైకెత్తలేరు.. దేనినీ పట్టుకోలేరు.. సొంత పనులూ చేసుకోలేరు.. ఏ తోడు లేకుండా ఒక్క ఇంచు కూడా కదల్లేరు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవశ్చవం. అరుదైన ఎంఎన్‌డీ వ్యాధితో మంచానికి పరిమితమైన గార్లదిన్నె మండలం పాతకల్లూరులోని నిరుపేద వివాహిత కన్నీటి గాథ ఇది.
గార్లదిన్నె: మండలంలోని పాతకల్లూరు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న బాలయ్య, నాగేంద్రమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు ఇంటి వద్దేనే ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం నాగేంద్రమ్మ కాళ్లు చేతులు సచ్చు పడడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు.
కబళించిన అరుదైన వ్యాధి..
రూ.లక్షలు ఖర్చు పెడుతున్నా వ్యాధి నయం కాకపోవడంతో బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి నాగేంద్రమ్మను కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అరుదైన మోటారు న్యూరాన్ వ్యాధి (ఎంఎన్‌డీ) బారిన పడినట్లుగా నిర్ధారించారు. నరాల బలహీనత వల్ల కాళ్లు, చేతులు సచ్చు పడిపోయాయని, శస్త్రచికిత్స చేస్తే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో నిరుపేద కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ వైద్యానికి చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. రూ.4 వేల విలువైన మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లికి శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టాలని కుమార్తె శ్రీలక్ష్మి వేడుకుంటోంది.
అందని ప్రభుత్వ పింఛన్..
రెండున్నర సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నాగేంద్రమ్మకు పింఛన్ మంజూరు చేయడంలో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దివ్యాంగుల పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ ఉండాలని అధికారులు అంటున్నారు. దీంతో సదరంలో స్లాట్ బుక్ చేసుకునేందుకు సచివాలయానికి వెళితే అప్పటికే గడువు ముగిసినట్లుగా అక్కడి సిబ్బంది తెలిపారు. ఇలా ఇప్పటి వరకూ ఐదారు సార్లు జరిగినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు.
అరుదైన వ్యాధితో
మంచాన పడిన వివాహిత
దిక్కుతోచని స్థితిలో భర్త, పిల్లలు
ఇప్పటికే బెంగళూరు, గోవాలో వైద్యానికి రూ.లక్షల ఖర్చు
శస్త్రచికిత్సతో ఫలితముంటుందన్న
నిపుణులు
దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం
సాయం చేయదలిస్తే..
పేరు : శ్రీలక్ష్మి (కుమార్తె)
బ్యాంకు : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా,
కల్లూరు, గార్లదిన్నె మండలం
బ్యాంకు ఖాతా : 3354 766 8711
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్ 0002737
ఫోన్ నంబర్ : 91006 46288