
ఈతకు వెళ్లి యువకుడి మృతి
రాప్తాడు: స్థానిక పండమేరు వంకలోకి ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని పండమేరు వంకపై అయ్యవారిపల్లి చెక్ డ్యాం వద్ద ఆదివారం ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి రాప్తాడుకు చెందిన తలారి గిరీష్‌కుమార్ (27) వెళ్లాడు. లోతైన ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేక నీట మునిగాడు. స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. ఘటనతో రాప్తాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
‘హంద్రీ–నీవా’లో
తెలంగాణ వాసి గల్లంతు
వజ్రకరూరు: మండల పరిధిలోని హంద్రీ–నీవా కాలువలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని నల్గొండ జిల్లా కందుకూరు మండలం శాంతిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మహాలయ పౌర్ణమిని పురస్క రించుకుని బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి వజ్రకరూరు మండలం పీసీ.ప్యాపిలికి ఆదివారం వచ్చాడు. ఈ క్రమంలో పీసీ ప్యాపిలి వద్ద ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లిన నాగిరెడ్డి... ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. కళ్ల ఎదుటే నీటిలో కొట్టుకు పోతున్న నాగిరెడ్డిని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాగిరెడ్డి స్నేహితుడు రాజశేఖర్ సమాచారంతో పోలీసులు రంగంలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
బైక్ పై నుంచి
కిందపడి వ్యక్తి మృతి
పరిగి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం గణపతిపల్లికి చెందిన వెంకటస్వామి (60)కి భార్య ముత్యాలమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం పైడేటి క్రాస్‌కు వచ్చిన వెంకటస్వామి పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. స్వగ్రామానికి సమీపంలోకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.