
వీర విజృంభణ
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 ఇన్విటేషన్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కోగటం హనీష్ వీరారెడ్డి దూకుడు ప్రదర్శించాడు. కేవలం 40 బంతుల్లో 107 పరుగులు సాధించి ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. వివరాలు.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం ఆంధ్రా ప్రెసిడెంట్, ఆంధ్రా సెక్రటరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి సెక్రటరీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 48.5 ఓవర్ల వద్ద 167 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఆర్దిత్ రెడ్డి 37 పరుగులు, జి.మన్విత్ రెడ్డి 31 పరుగులు చేశారు. ప్రెసిడెంట్ జట్టు బౌలర్ షాహుల్ హమీద్ ఐదు వికెట్లు తీసి సెక్రెటరీ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు కేవలం 27.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగుల లక్ష్మాన్ని ఛేదించింది.
బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి 40 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి బాటలు వేశాడు.
మధ్యప్రదేశ్ వరుస విజయాలు..
మధ్యప్రదేశ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 48.1 ఓవర్ల వద్ద 218 పరుగులకు ఆలౌట్ అఇంది. యశ్వర్ధన్ సింగ్ 128 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 38.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. 88 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ జట్టు గెలుపొందింది.
40 బంతుల్లో 107 పరుగులు