
వసూళ్లలో మార్కెట్ కమిటీల డీలా
● అనంతపురం, ఉరవకొండ మినహా
మిగతావన్నీ వెనుకంజ
అనంతపురం అగ్రికల్చర్: వివిధ రకాల మార్కెట్ ఫీజు వసూళ్లలో జిల్లాలోని చాలా మార్కెట్ యార్డులు డీలా పడ్డాయి. అనంతపురం, ఉరవకొండ మార్కెట్ కమిటీలు మాత్రమే లక్ష్యసాధనలో ముందంజలో ఉండగా.. మిగిలిన ఏడు కమిటీలు వసూళ్లలో వెనుకబడ్డాయి. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్‌పోస్టుల ద్వారా రూ.13.49 కోట్లు రాబట్టాలని మార్కెటింగ్ శాఖ లక్ష్మ నిర్ధేశన చేసింది. ఆగస్టు నెలాఖరుతో ముగిసిన ఐదు నెలల కాలంలో రూ.4.68 కోట్లు వసూలైంది. అనంతపురం టార్గెట్ రూ.5.10 కోట్లు కాగా ఇప్పటికే 45.60 శాతంతో రూ.2.32 కోట్లు సాధించారు. అలాగే ఉరవకొండ టార్గెట్ రూ.90 లక్షలు కాగా 57.84 శాతంతో రూ.52 లక్షలు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుత్తి మార్కెట్ కమిటీ కేవలం 13 శాతం వసూళ్లతో అట్టడుగున కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రాప్తాడు 17 శాతం, గుంతకల్లు 20 శాతం, కళ్యాణదుర్గం 21 శాతంతో లక్ష్యానికి అందనంత దూరంలో పయనిస్తున్నాయి. రాయదుర్గం 24 శాతం, తాడిపత్రి 26 శాతం, శింగనమల 32 శాతంతో కాస్త ఫరవాలేదన్నట్లుగా ఉన్నాయి. గత నాలుగేళ్లుగా అనంతపురంతో పోటీ పడి అగ్రస్థానం సాధిస్తూ వస్తున్న శింగనమల మార్కెట్ కమిటీలో వసూళ్లు దారుణంగా పడిపోవడం విశేషం.