
అంతిమ విజయం న్యాయానిదే
గుంతకల్లు టౌన్: వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి సర్కారు ఎన్ని కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయించినా అంతిమ విజయం న్యాయానిదే అవుతుందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మద్యం అక్రమ కేసులో విశ్రాంత అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినా... వారిని జైలు నుంచి విడుదల చేయకుండా అడ్డుకుంటున్న జైలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందన్నారు. గతంలో తాడిపత్రికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చినా సంబంధిత అధికారులు బేఖాతరు చేశారన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులపై ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భవాని, మాజీ చైర్మన్ జింకల రామాంజి, కౌన్సిలర్లు నీలావతి, కుమారి, లింగన్న, సుమో బాషా, కోఆప్షన్ సభ్యుడు ఫ్లయింగ్‌మాబు, నూర్‌నిజామి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి