
రేపు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 7న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
బాలల చట్టాలపై
అవగాహన అనివార్యం
అనంతపురం: బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమా రావు అన్నారు. శనివారం పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్. చినబాబు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు, పోలీసులతో జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించారు. బాలల రక్షణ చట్టాల్లోని కీలక అంశాలను చర్చించారు. ఏపీ హైకోర్టులో సెప్టెంబర్ 14న రాష్ట్రస్థాయి జువైనల్ జస్టిస్ కమిటీ సదస్సు జరగనుందని, జిల్లాకు సంబంధించిన వివరాలు సమగ్రంగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు.
కోర్టుల తనిఖీ..
గుత్తి: పట్టణంలోని కోర్టులను జిల్లా జడ్జి భీమారావు శనివారం తనిఖీ చేశారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన ఏడీజే, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ చారి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
కార్యదర్శుల నియామకం
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)గా పలువురిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు చెందిన మొలగవళ్లి మహేంద్రనాథ్‌రెడ్డికి కళ్యాణదుర్గం అసెంబ్లీ, అనంతపురం జిల్లాకు చెందిన కే.రమేష్‌రెడ్డికి ధర్మవరం, శింగనమల అసెంబ్లీ స్థానాలు, నార్పల సత్యనారాయణ రెడ్డికి రాప్తాడు, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలు, ఎల్‌ఎం మోహన్ రెడ్డికి రాయదుర్గం, తాడిపత్రి అసెంబ్లీ స్థానాలు, బోయ తిప్పేస్వామికి గుంతకల్లు, అనంత పురం అర్బన్ అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నారు.

రేపు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక