
ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు
గుంతకల్లు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తగదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మంజునాథ్, సుదర్శన్, పుష్యమి అన్నారు. వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సచివాలయ కార్యదర్శులను వలంటీర్లుగా మార్చడం తగదన్నారు. గతంలో వలంటీర్లకు ఒక క్లస్టర్‌ను పరిమితం చేస్తే ఇప్పుడు ఒక్కో కార్యదర్శికి మూడు క్లస్టర్‌లకు మ్యాప్ చేసి బలవంతంగా ఉద్యోగం చేయించడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీదేవికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో నిరసనాగ్రహం..
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం క్లస్టర్ విధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో సచివాలయ ఉద్యోగులు నిరసననాగ్రహాన్ని ప్రదర్శించారు. శనివారం నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జేఎసీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ అరియర్స్, పదోన్నతులు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్, కల్పించడంలో ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని, ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మి నారాయణ, డీ సుధాకర్, రామకృష్ణ, చీరాల చంద్ర, శివశంకరయ్య, వరప్రసాద్, మౌలాలమ్మ, తేజశ్రీ, విమల పాల్గొన్నారు.