
యూరియా ఎక్కడ ఉంటే అక్కడికే!
● పరుగులు పెడుతున్న రైతులు
శింగనమల: మండలంలో యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలో ఎక్కడ పంపిణీ చేస్తున్నారని తెలిసినా వెంటనే అక్కడికి పరిగెత్తుతున్నారు. శనివారం శింగనమలలోని సింగిల్ విండో కార్యాలయానికి 10 టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, వచ్చిన యూరియా మధ్యాహ్నం లోపు ఖాళీ కావడం గమనార్హం. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. మండలంలో కల్లుమడి, తరిమెల, నిదన వాడ, రాచేపల్లి, ఉల్లికల్లు, కొరివిపల్లి, చీలేపల్లి, జూలకాల్వ, పి.జలాలపురం, పెరవలి, పోతురాజు కాల్వ, చక్రాయిపేట, సీ.బండమీదపల్లి, శివపురం, శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, గురుగుంట్ల, మదిరేపల్లి, లోలూరు గ్రామాల్లో వ్యవసాయ బోరు బావుల కింద వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటకు యూరియా అవసరం ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఓ అన్వేష్‌కుమార్ మాట్లాడుతూ కల్లుమడి, తరిమెల సింగిల్ విండో కార్యాలయాలకు యూరియా సరఫరా చేశామని, మంగళవారంలోపు శింగనమల,రాచేపల్లి,కొరివిపల్లి, ఉల్లికల్లుకి సరఫరా చేస్తామని చెప్పారు.