
సంకల్పానికి తలొగ్గిన ప్రకృతి
● చౌడు భూమిలో సిరుల పంటలు
● పర్మా కల్చర్‌తో ఆదర్శంగా నిలిచిన మహిళా రైతు
పామిడి: సెంట్రల్ ఎకై ్సజ్ శాఖలో సెక్రటరీగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన పెమ్మక కదిరి నీలారెడ్డి... ప్రస్తుతం 64 ఏళ్ల వయస్సులో వ్యవసాయంలో రాణిస్తున్నారు. ప్రకృతిని అనుసరిస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించేలా పర్మా కల్చర్ చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆమె సంకల్పానికి ప్రకృతి తలొగ్గింది. వందేళ్లకు పైగా బీడుగా ఉన్న నిస్సారమైన చౌడు నేల నేడు సారవంతంగా మారింది. ఒకటి రెండు కాదు.. మామిడి, మల్బరీ, నేరెడు, సపోటా, నిమ్మ, బత్తాయి, చీనీ, జామ, మునగ, కళింగర, సొర, చిక్కుడు, టమాట తదితర 35 రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచారు.
సొంతూరిపై మమకారం
పామిడి మండలానికి చెందిన పెమ్మక కదిరి నీలారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం తన సొంతూరిపై మమకారంతో పి.కొత్తపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన పూర్వీకుల వ్యవసాయ విధానాలకు జీవంపోస్తూ పంటల సాగు చేపట్టాలని నిర్ణయించుకుని ఓబుళాపురం గ్రామంలోని 6.5 ఎకరాల పొలాన్ని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అయితే వందేళ్లుగా ఆ భూమిలో ఒక్క పంటను కూడా పండించలేదు. చౌడు శాతం ఎక్కువగా ఉండడంతో పంటల సాగుకు యోగ్యంగా లేదని బీడుగా వదిలేశారు. అలాంటి భూమిని కొనుగోలు చేస్తున్న సమయంలో నీలారెడ్డి శ్రమ వృధా అవుతుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ పర్మాకల్చర్ విధానాలతో చౌడు భూమిని సారవంతం చేశారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం ఆమె నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతుండడం గమనించిన రైతులు పర్మాకల్చర్ విధానాలను అడిగి తెలుసుకుంటున్నారు.